దేశం దాటి ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ ఐన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో బాధితుడు తన బాధను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
దీనిపై ఒక ప్రముఖ పత్రికలో ‘ఎడారిలో బందీ’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారు. వీరయ్యను క్షేమంగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.వీరయ్య వీసా ముగియడంతో అతడిని స్వదేశానికి పంపించేందుకు అధికారులు ప్రత్యేక వీసా తయారు చేయించారు.
ఈనెల 25న విమానం టికెట్ బుక్ చేశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముంబై వరకు టికెట్ బుక్ చేయడంతో వీరయ్య ఈ నెల 26న వేకువ జామున సౌదీ అరేబియా నుంచి బయల్దేరాడు. 27వ తేదీన ముంబై చేరుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి బస్సులో జగిత్యాలకు వచ్చి నిన్న శుక్రవారం కరీంనగర్ చేరుకున్నాడు.