ఏపీలో ఇటీవల ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుండి కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ సభ్యుడు సిఎమ్ రమేష్ సోదరులు నిర్వహించిన అక్రమ మైనింగ్ కు సంబందించి 21 కోట్ల జరిమానా కట్టవలసి ఉన్నా,వారి జోలికి అదికారులు వెళ్లే సాహసం చేయడం లేదంటూ ఒక వార్త వచ్చింది.గత ప్రభుత్వ హయాంలోనే ఈ జరిమానా నోటీసు వెళ్లినా,ఇంతవరకు చెల్లించలేదట.దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోట్లదుర్తి బ్రదర్స్ నేతృత్వంలో కడప జిల్లా ముద్దనూరు మండలం లో చేపట్టిన క్రషింగ్ యూనిట్ ద్వారా 5.10లక్షల క్యూబిక్ మీటర్లు స్టోన్ క్రషర్ అక్రమంగా మైనింగ్ చేశారు. ఆమేరకు యర్రగుంట్ల మైనింగ్ ఏడీ వెంకటేశ్వర్లు నిర్ధారించారు. ఇందుకు రూ.21.67కోట్లు అపరాధ రుసుం చెల్లించాల్సిందిగా ఫిబ్రవరి 27న డిమాండ్ నోటీసు జారీ చేశారు. నోటీసుకు 90రోజుల లోపు జవాబు ఇవ్వాలి. కానీ 120 రోజులు గడుస్తున్నా పోట్లదుర్తి బ్రదర్స్ బినామీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆర్‌ఆర్ యాక్టు ప్రయోగించి జప్తు చేయాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. అటువైపు కన్నెత్తి చూసే సాహాసం చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. నాటి స్వామిభక్తిని నేటికీ అధికార యంత్రాంగం కొనసాగిస్తుండడమే అందుకు కారణంగా చెబుతున్నారంటూ మీడియాలో కదనం వచ్చింది.రమేష్ హడావుడిగా బీజేపీలో చేరింది ఇందకుకేనంటూ ప్రచారం సాగుతుంది.
