ఆంధ్రప్రదేశ్ రాజధాని దగ్గర కృష్ణా కరకట్ట లోపల ఉన్న అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన సిఆర్డిఎ అధికారులు శనివారం మరో 10 మందికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ప్రజా వేదికను కూల్చివేసి, చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్ కు సైతం రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తాజాగా శనివారం తులసీ గార్డెన్స్, లింగమనేని రమేష్, చందన బ్రదర్స్, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, పాతూరి సుధారాణి, శైవక్షేత్రంలోని ఆరుగురికి సిఆర్డిఎ అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణానది నుంచి కరకట్టకు మధ్యలో ఉన్న భవనాలన్నింటికీ నోటీసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
