భూమా అఖిలప్రియ…ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత. భూమా కుటుంబ సభ్యురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిలప్రియ గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ వచ్చిన అఖిలప్రియ… టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాలలో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో అటు ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన అఖిలప్రియ, ఇటు నంద్యాల నుంచి పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి ఇద్దరూ ఓటమి చెందారు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో భూమా అఖిలప్రియ మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జిల్లా రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇందుకోసం సీఎం జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను సంప్రదించేందుకు భూమా అఖిలప్రియ ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, వైసీపీలో అవకాశాలు లేకపోవడం, ఆ పార్టీ నేతలు అఖిలప్రియను దూరం పెట్టడంతో మరో రూపంలో…మీడియాలో ఉండేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
తాజాగా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ, అవినీతి రహితపాలన అందిస్తామని జగన్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అధికారులెవరూ సీఎం మాటలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. అందుకే, ఇక నుంచి సీఎం జగన్ కు ప్రతిరోజు ఓ లేఖ రాస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చిన్న అవినీతి జరిగినా నేరుగా జగన్ కే లేఖల రూపంలో తెలియజేస్తామని అఖిలప్రియ తెలిపారు.