ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల స్నేహ సంబంధాలను పటిష్ఠం చేయడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు.
గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధానాంశాలు సహా 5 కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే పలు దఫాలు లాంఛనంగా ముఖ్యమంత్రుల భేటీలు జరిగాయి. గవర్నర్ సమక్షంలోనూ చర్చించారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు సన్నద్ధమయ్యారు.
వారి మధ్య తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇవాళ ఉదయం ప్రగతిభవన్‌లో ప్రారంభమైంది. ముఖ్యంగా గోదావరి వరద జలాల తరలింపు, కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటిని రెండు రాష్ట్రాలు సమగ్రంగా వినియోగించుకోవడం, విద్యుత్తు సంస్థల విభజన, తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన సహా పలు కీలకాంశాలపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. దిల్లీలోని ఏపీ భవన్‌పై కూడా చర్చించే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధాన అంశాలపై ముఖ్యమంత్రులిద్దరూ చర్చించి ఓ అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.