ఏపీ ప్రభుత్వం అక్రమ కట్టడాల మీద కూడా విరుచుకు పడుతోంది. ఇప్పటికే అమరావతిలో ప్రజావేదికను కూల్చేయించిన ప్రభుత్వం .. కరకట్ట మీద ఉన్న అన్ని అక్రమ కట్టడాలకి నోటీసులు జారీ చేసి అవి కూడా త్వరలో పడగోడతాం అంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో అన్ని చోట్లా ఉన్న అక్రమ కట్టడాల మీదా ద్రుష్టి సారించింది. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, దుకాణాలు, ఇతర కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశాఖ అధికారులు రంగంలోకి దిగారు. టీడీపీ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మురళీ మోహన్‌కు చెందిన కార్ల షోరూమ్‌ను నేలమట్టం చేశారు. జోన్-2లోని ఎంవీపీ సెక్టార్-11లో నిబంధనలకు విరుద్ధంగా జయభేరి ట్రూ వ్యాల్యూ కార్ షోరూమ్‌ను నిర్మించారు. వెయ్యిగజాల స్థలంలో ఉన్న ఇందులో పాతకార్ల అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి. దీనికి ప్లాన్ లేకపోవడంతో కూల్చేయాలని కమిషనర్ జి.సృజన ఆదేశించారు. బుధవారం మునిసిపల్ సిబ్బంది బుల్డోజర్లు తీసుకొచ్చి షోరూమ్‌ను పడగొట్టారు.
