ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ గతేడాది పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. పిరమాల్ వారసుడు ఆనంద్ పిరమాల్‌ను ఆమె పెళ్లాడారు. పెళ్లికానుకగా ఇషాకు తన అత్తింటి వారు ఖరీదైన కానుకనే ఇచ్చారు. వర్లీలోని 50వేల చ.అడుగుల విస్తీర్ణం ఉన్న గలీటా భవనం ఆమెకు బహుమతిగా అందింది. దీని ఖరీదు సుమారు రూ. 450 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దక్షిణ ముంబయిలోని వర్లీ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవనాన్ని గతేడాదే పిరమాల్ కుటుంబసభ్యులు సొంతం చేసుకున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా దాన్ని రీ మోడల్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ భవనం ఇంటీరియర్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
