సరిగ్గా రెండేళ్ళ వయస్సున్న పాప ప్రాణాలను కాపాడిన ఫ్యూజీ జబాత్(17) అనే యువకుడిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. ఇంతకూ ఫ్యూజీ ఏం చేశాడంటే.. ఆడుకుంటూ రెండో అంతస్థు నుంచి పడిపోయిన పాపను సరిగ్గా నేలమీద పడిపోయే క్షణంలో పట్టుకుని కాపాడాడు. ఇస్తాంబుల్‌లోని ఫాతీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పాప తల్లి వంటగదిలో ఉన్న సమయంలో దోహ మహమ్మద్(2) అనే పాప కిటికీ వద్దకు వెళ్లింది. కిటికీ నుంచి బయటకు చూస్తూ ఒక్కసారిగా కిందకు బోర్లా పడిపోయింది. అదే సమయంలో బిల్డింగ్ ఎదురుగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న ఫ్యూజీ పాప కిటికీలో నుంచి పడే సమయంలోనే గమనించాడు. వెంటనే పాప నేలమీద పడే సమయంలో గట్టిగా పట్టుకోవడంతో ఎటువంటి గాయాలు కూడా కాకుండా చిన్నారి క్షేమంగా బయటపడింది. ఫ్యూజీ రియల్ హీరో అని.. తాను లేకపోతే ముక్కుపచ్చలారని పాప ప్రాణాలు పోయి ఉండేవని నెటిజన్లు సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు.