అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం. విజయ నిర్మల పార్థివ దేహాన్ని ఈ రోజు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వచ్చారు. ఈ రోజు మొత్తం అక్కడే వుంచి రేపు ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకువస్తారు. శుక్రవారం విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి.
