తెలంగాణ వ్యవసాయ పాలసీలు ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రైతులకు అండగా నిలుస్తున్న 20 అత్యుత్తమ పథకాలలో తెలంగాణ నుండి రైతుబంధు, రైతుభీమా పథకాలు నిలిచాయి. ఐక్యరాజ్యసమితి ఈ పథకాలను అన్ని దేశాలకు వివరించాలని ఆహ్వానించిందని, రైతుల పట్ల కేసీఆర్ నిబద్దత, చిత్తశుద్ది మూలంగా ఇలాంటి పథకాలు సాధ్యం అయ్యాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండవరోజు హైటెక్స్ లో జరిగిన విత్తన రైతుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణలోని రైతుబంధు, రైతుభీమా పథకాలు మాత్రమే కాకుండా కళ్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటి ప్రతి పథకమూ ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఆదర్శనీయం, ఆచరణీయం అని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు చనిపోయిన వారం రోజులలో రూ.5 లక్షలు సాయం ఎలాంటి సిఫారసులు లేకుండా ఆ బాధిత కుటుంబం దరిచేరడం మామూలు విషయం కాదని, ఇప్పటికి 1200 పైచిలుకు కుటుంబాలకు రూ.650 కోట్ల వరకు పరిహారం అందిందని, రాష్ట్రంలో మొత్తం 58 లక్షల మంది రైతులకు 53 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులేనని, వారికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఈ పథకం అమలులో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల కృషి అభినందనీయమని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తెలంగాణ విత్తన రంగం గత ఐదేళ్లలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, దీనికి కేసీఆర్ మార్గదర్శనమే కారణం అని, ఇస్టా సదస్సు మూలంగా భవిష్యత్ లో ప్రపంచంలో ప్రముఖ స్థానానికి చేరుకుంటుందన్న నమ్మకం ఉందని తెలిపారు. మిషన్లు తయారు చేయలేని ఏకైక వస్తువు విత్తనం అని, విత్తన పంటల సాగుమీదనే రైతులు దృష్టి సారించాలని, తెలంగాణ రైతు సుసంపన్నమైన రైతు కావాలి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇస్టాలో 80 సభ్యత్వదేశాలు ఉన్నాయని, మన విత్తనాలు ఆయా దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మరింత మెరుగుపడతాయని, తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదగడానికి ఇది ఒక్క మెట్టు అని అన్నారు.