ఇటీవల టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు ఇచ్చారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానం చేసి లేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా దానిని అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తామంతా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నామని చేరినవారు వెల్లడించారు. అలాగే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా టీడీపీని వీడబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ సీనియర్ నేత బీజేపీలో చేరబోతున్నారట.. ఇంతకీ ఆయన ఎవరో కాదు ప్రముఖ సినీనిర్మాత, వ్యాపారవేత్త అంబికా కృష్ణ. ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సన్నిహితంగా ఉంటున్న ఆయన ఇప్పుడు పార్టీని వీడుతున్నారట.. ఎఫ్ డీసీ చైర్మన్ గా కొనసాగిన ఆయన తాజాగా ఆయన పదవికి రాజీనామా చేసారు. టీడీపీలో ఉంటే రాజకీయ మనుగడ కష్టమని భావించిన అంబికా బీజేపీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.
