ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్, అధికారి దగ్గర ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . సోమవారం ఆయన ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ..ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను తీసుకొస్తున్నాం. రెండు వేల మంది నివాసం ఉండే ప్రతిగ్రామంలో గ్రామసచివాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యత ఆ వాలంటీర్ తీసుకుంటారు. ప్రతి సంక్షేమ పథకాన్ని డోర్ డెలివరీ చేస్తారు. ఇది చేసేటప్పుడు గ్రామ వాలంటీర్ అవినీతికి పాల్పడవద్దు. వివక్ష చూపవద్దు. ఇలా చేయవద్దని రూ.5వేల జీతం ఇస్తున్నాం. అవినీతికి పాల్పడితే నేరుగా సీఎం ఆఫీస్‌కు కాల్ చేయవచ్చు. నేరుగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. 50 ఇళ్ల పరిధే కాబట్టి విచారణకు పెద్దగా ఇబ్బంది ఏర్పడదు. తప్పు చేస్తే వెంటనే తొలగిస్తాం. ఇందులో ఏమాత్రం మొహమాటం పడవద్దని చెబుతున్నాను. ప్రభుత్వ యంత్రాగం అంతా నిజాయితీగా పనిచేయాలి. గ్రామస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదు. ప్రతి పనిలో పారదర్శకత కనిపించాలి. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు వ్యవస్థలో మార్పు రావాలి. దేశం మొత్తం మనవైపు చూడాలి. మన రాష్ట్రాన్ని నమూనగా తీసుకోవాలి.
