ఏపీలో మరికొద్దిరోజుల్లో సుమారు రెండు లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఆయా జిల్లాలవారీగా గ్రామ వాలంటీర్ల నియామకం చేపడుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13జిల్లాల్లో 1,84,498 మంది వాలంటీర్లను నియామకం చేపట్టనున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించబోతోంది. ప్రభుత్వ పధకాలు కుల, మత, ప్రాంతాలకతీతంగా అందించడమే ప్రధాన ఉద్దేశం.. అయితే గ్రామ వాలంటీర్లు ఇంకా ఎంపికకాకముందే వారికి ముఖ్యమంత్రి జగన్ హెచ్చరికలు జారీ చేశారు.
అవినీతి లేకుండా చేసేందుకే ఒక్కో గ్రామ వాలంటీర్‌కు నెలకు రూ.5వేల చొప్పున గౌరవవేతనం అందజేయనున్నామన్నారు. ఎవ్వరూ అవినీతికి తావు లేకుండా పనిచేయాలన్నారు. ఏ మాత్రం తప్పు జరిగిందని తెలిస్తే తాను ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఆ వాలంటీర్‌ను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పిస్తామని జగన్ చెప్పారు. వీరు అవినీతికి పాల్పడితే నేరుగా తనకే ఫిర్యాదులు అందేలా ఏర్పాట్లు చేస్తామన్నారు జగన్.