ఈనెల 4న విశాఖ శారదాపీఠం సందర్శనకు వచ్చిన వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం విమానాశ్రయం వద్ద బ్లడ్ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విశాఖ జ్ఞానాపురానికి చెందిన తమ స్నేహితుడు నీరజ్‌కుమార్ ‘సేవ్ అవర్ ఫ్రెండ్’బ్యానర్‌తో నిల్చుండగా. కారులోంచి బ్యానర్ చూసిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని నిలిపి వారితో మాట్లాడి నీరజ్‌కుమార్ వైద్యానికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, దిగులు చెందవద్దని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం ఆదేశాల మేరకు నీరజ్‌కుమార్‌కు వైద్యం శరవేగంగా అందుతోంది. ఇప్పటికే వైద్యం కోసం రూ.10 లక్షలు ప్రభుత్వం నుంచి చెల్లించారు. ఇంకా ఎంత అవసరమైతే అంత సొమ్ము ప్రభుత్వమే సమకూరుస్తుందని కుటుంబ సభ్యులకు, ఆస్పత్రి వర్గాలకు సీఎంవో అధికారులు స్పష్టం చేశారు. నీరజ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితిని, వైద్యం అందుతున్న తీరును ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా నీరజ్‌కుమార్ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం కీమోథెరపీ చేస్తున్నారు. గుండెకు రక్తప్రసరణలో తలెత్తిన సమస్యను కూడా సరిచేశారు. ఇప్పుడు ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందిస్తున్నారు. గతంలో మాదిరిగా గొట్టం ద్వారా కాకుండా ఇప్పుడు నేరుగా నోటి నుంచి ఆహారం ఇస్తున్నారని నీరజ్‌కుమార్ తండ్రి అప్పలనాయుడు చెప్పారు. తమ కుమారుడు ఏమవుతాడోనని కొన్నాళ్లుగా ఆందోళనతో ఉన్న తమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేవుడిలా ఆదుకుంటున్నారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.
