టీ.కాంగ్రెస్‌కు ఎందుకీ దుస్తితి?
sivakumar
June 22, 2019
18+, POLITICS, SLIDER, TELANGANA
753 Views
తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఉన్న కొద్దిమంది నేతలతో రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఎవరైనా పార్టీ నేతలు నోరు జారినా, దూకుడుగా వ్యవహరించినా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంకా చెప్పాలంటే..చేష్టలు ఉడిగిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదు రోజుల కింద పార్టీ నాయకత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమై రాజగోపాల్ రెడ్డి మాటలు క్రమశిక్షణ ఉల్లంఘనేనని నిర్ధారించింది. కానీ ఎలాంటి చర్య తీసుకోకుండా హైకమాండ్ కు నివేదించింది. హైకమాండ్ రాజగోపాల్‌రెడ్డి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించినా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పలేదని సమాచారం.
వరుస ఎన్నికల్లో ఎదురుదెబ్బలతో రాష్ట్రంలో పార్టీ సంక్షోభంలో ఉండటంతో నేతలెవరినీ చేజార్చుకోవద్దని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. నేతలపై కఠిన చర్యలేమీ తీసుకోకుండా వివరణ తీసుకోవడంతో సరిపుచ్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, కొందరు కీలక నేతలు బీజేపీ, టీఆర్ఎస్‌లో చేరడం, ఇంకొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఏఐసీసీ హైకమాండ్.. నాయకత్వం పీసీసీకి ఈ సూచన చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రాజగోపాల్ రెడ్డి పీసీసీ నాయకత్వంపై విమర్శలు చేశారు. అప్పుడు క్రమశిక్షణ కమిటీ కేవలం షోకాజ్ ఇచ్చి వివరణ తీసుకుంది. మళ్లీ తాజాగా షోకాజ్ ఇచ్చి వదిలిపెట్టింది. కాంగ్రెస్ పార్టీ పరిణామాలు చూస్తుంటే… కాంగ్రెస్‌లో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై వేటు పడదని…షోకాజ్ నోటీసులతోనే సరిపుచ్చుతారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.
Post Views: 266