మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ, వైసీపీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.. తాజాగా నలుగురు ఎంపీలు భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకుంటే, తాజాగా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాగే తాజాగా వైసీపీ ప్రభుత్వం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దగ్గరగా ఉండే ప్రజావేదిక క్యాంప్ కార్యాలయంలో ఈ నెల 24న జరగబోయే కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఉండవల్లిలోని తన నివాసం సమీపంలో ఉండే ప్రజావేదిక ప్రాంగణాన్ని తమకు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ అధినేతగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ప్రజావేదిక ప్రాంగణాన్ని కేటాయించాలని కోరారు. జగన్‌కు ప్రత్యేకంగా లేఖ కూడా రాశారు.
అయితే ఈ లేఖపై విజయసాయి రెడ్డి తీవ్రంగా విమర్శించారు.. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.. అంతటితో ఆగకుండా ప్రజావేదిక ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించి, వెంటనే రంగలోకి దిగింది. చంద్రబాబు నివాసం పక్కనే ఉండే ప్రజా వేదికను, మేము వాడుకుంటామని, దానికి అయ్యే ఖర్చులు అన్నీ భరిస్తామని చంద్రబాబు చెప్పినా వినలేదు. ప్రభుత్వం నిర్ణయం తో రాష్ట్ర రాజకీయం మరోసారి హీటెక్కింది. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ తమ్ముళ్లు వాయిస్ వినిపిస్తున్నారు. కనీసం తన ఇంటి పక్కనున్న భవనాన్ని కాపాడుకోలేని చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు రాజకీయ జీవితం ఇక ముగిసినట్టేనని చెప్తున్నారు.