ప్రపంచ కప్ లో తొలిసారిగా టీమ్ ఇండియా తడబడుతుంది. ఈ క్రమంలో పసికూన అయిన అఫ్గానిస్థాన్ జట్టు స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. మధ్య ఓవర్లలో కనీసం సింగిల్స్ తీసేందుకు కూడా అవకాశం లేకుండా స్పిన్ దళం చుక్కలు చూపించారు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఆఖర్లో సీనియర్ ప్లేయర్లు ధోనీ, కేదార్ జాదవ్ బ్యాట్ ఝుళిపించలేకపోయారు. రషీద్ ఖాన్ వేసిన 45వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చిన ధోనీ(28) స్టంపౌట్ అయ్యాడు. బంతిని స్టాండ్స్‌లోకి పంపాలనే ఉద్దేశంతో ముందుకు రాగా.. బంతి మిస్‌కావడంతో వికెట్ కీపర్ ఇక్రం అలీ బంతిని అందుకొని వేగంగా వికెట్లను గిరాటేశాడు. అంతుకుముందు బంతిని షాట్ ఆడి పరుగు తీసేందుకు యత్నించి ధోనీ నిరాకరించడంతో జాదవ్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 45 ఓవర్లకు భారత్ 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. జాదవ్(32), పాండ్య(1) క్రీజులో ఉన్నారు.