ఏపీ రాజధానిలోని ప్రజా వేదిక వద్ద టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కాసేపు హల్ చల్ చేశారు . కలెక్టర్ల సమావేశం నిమిత్తం ప్రజా వేదికలో ఏర్పాట్లు చేస్తుండగా శనివారం అక్కడకు వచ్చిన రాజేంద్రప్రసాద్ చంద్రబాబు సామాన్లు, టీడీపీ కార్యాలయం నమూనాను ఎవరు బైటపెట్టారని అధికారులను ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా వస్తువులు ఎలా బయటపెడతారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అయితే తాము నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని అధికారులు సమాధానం చెప్పారు. గతంలో కలెక్టర్ల సమావేశం ప్రజా వేదికలో జరిగేదని.. ఇప్పుడు కూడా అలానే ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు.
అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం పెడితే ఇబ్బందవుతుందని తెలిపారు. ఇక్కడ రోడ్లు, స్థలం ఇరుకుగా ఉంటయన్నారు. చంద్రబాబు కట్టిన ప్రజా వేదికలోనే కలెక్టర్ల సమావేశం పెట్టలా.. వేరే చోట పెట్టుకోకూడదా అని ప్రశ్నించారు. ఒకప్పుడు ప్రజా వేదిక జర్నలిస్ట్‌లకు షెల్టర్‌గా ఉండేదన్నారు రాజేంద్రప్రసాద్. అయితే విలేకరులు ఆయన మాటలకు అడ్డుపడుతూ.. తమని ఎన్నడూ ప్రజా వేదికలోకి రానివ్వలేదన్నారు. మీడియా ప్రతినిధుల సమాధానంతో కంగుతిన్న రాజేంద్రప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సోషల్ మీడియాలో సెటైర్లతో వీపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. ఇదేందయ్యా.. ఇది బాబు రాజేంద్రప్రసాద్ అంటూ తెగ వైరల్ చేస్తున్నారు.