భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని గతంలో చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతులకు రూ. 1లక్ష వరకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు గాను ప్రత్యేక బడ్జెట్‌ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది. జూలై 5వ తేదీన జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకం కోసం కొంత బడ్జెట్‌ను కేటాయించనున్నారని తెలిసింది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 బడ్జెట్‌ను సిద్ధం చేస్తున్నందున అందులో ఈ పథకానికి కూడా నిధులు కేటాయించారని తెలిసింది. అయితే కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో రూ.1 లక్ష వరకు రుణం తీసుకుంటే దానికి వడ్డీ చెల్లించాల్సిన పనిలేదు. ఇక రుణాన్ని కూడా 1 నుంచి 5 ఏళ్ల లోపు తీర్చేయవచ్చు. ఈ క్రమంలో దేశంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ ఈ పథకం ఎంతో లబ్ది చేకూరుస్తుందని కేంద్రం భావిస్తోంది.
