ఏపీలో మధ్యాహ్న భోజనం పథకం పేరు మారింది… వారికి పెట్టే భోజనం కూడా మారింది.. ఈ పథకాన్ని వైఎస్‌ఆర్ అక్షయపాత్రగా మార్చుతున్నట్టు ఏపీ సీఎం స్పష్టంచేసి, అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, సంబంధిత అధికార యంత్రాంగంతో మధ్యాహ్న భోజనం పథకంపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని, అధికారులకు సీఎం సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు ఆసక్తి కనబర్చేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలని జగన్ అధికారులను ఆదేశించారు. వాస్తవానికి వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పున ప్రారంభానికి ఇంకెన్నో రోజులు లేని నేపథ్యంలో కాస్త సమయం తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టాలని అధికారులు అభిప్రయపడినా సీఎం మాత్రం వెంటనే పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దని చెబుతూ ఈ మధ్యాహ్న భోజనం పథకం బాధ్యతలను నిర్వర్తిస్తోన్న ఏజెన్సీలకు గౌరవవేతనం రూ.3వేలకు పెంచారు. పాఠశాలల్లో సకల సదుపాయాలు కలిగిన వంటశాలలు నిర్మించాలని తెలిపారు. ఇదంతా ఆరంభం మాత్రమేనని.. తర్వాతి సమావేశం నాటికి పూర్తిస్థాయి ప్రణాళికలతో రావాలని జగన్ అధికారులను ఆదేశించారు. అనుకున్నది అనుకున్నట్టుగానే కేవలం నెల తిరిగేలోపే విద్యార్ధులకు చక్కటి భోజనం అందిస్తుండడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.