తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానంచేసి ఆలేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అంగీకారం తెలిపారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభ బీజేపీ పక్ష నేత గెహ్లాట్, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అక్కడ ఉన్నారు. విలీనంపై బీజేపీ సమ్మతి లేఖను కూడా జేపీ నడ్డా వెంకయ్యకు అందించారు. అనంతరం వారు బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని, దీని ద్వారా ప్రభావితమైన టీడీపీ రాజ్యసభా పక్షానికి చెందిన నలుగురు సభ్యులు బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తామంతా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. అలాగే ముఖ్యంగా సుజనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశం ఆలోచన అందరికీ తెలుసు. మేం జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాం.. ఎన్డీఏ ప్రభుత్వంలో మూడున్నరేళ్లు మోదీ కేబినెట్‌లో సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలు సాధ్యమైనంత త్వరగా సామరస్యపూర్వకంగా పరిష్కారం కోసం బీజేపీలో చేరుతున్నామని పేర్కొన్నారు. అయితే సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, కంభంపాటిలపై విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వేలకోట్లు సంపాదించుకున్నారు కదా.. న్యాయంగా బ్రతకొచ్చుకదా అంటూ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. అలాగే మీరు అధికారం లేని పార్టీలో ఉంటే బ్రతకలేరా.? చచ్చిపోతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మీరు చేసిన దుర్మార్గపు పనులు, అవినీతి కేసులనుంచి తప్పించుకోవడానికే పార్టీలు మారుతున్నారంటూ విమర్శిస్తున్నారు.