తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతికి అంకితం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ప్రాజెక్టు ఇంజినీర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో వేదోచ్ఛరణల మధ్య జలసంకల్ప మహోత్సవ యాగం నిర్వహించారు. ఈ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్టించిన వేదపండితులు.. అనంతరం పూజలు ప్రారంభించారు. వరుణ దేవుణ్ణి ఆహ్వానిస్తూ మహాసంకల్ప యాగం నిర్వహించారు. ఈ యాగంలో గవర్నర్ నరసింహన్, సీఎంలు వైఎస్ జగన్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
