దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ ఉక్కు పరిశ్రమ ‘పోస్కో’… రాష్ట్రంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ఆసక్తి చూపింది. సంస్థ ముఖ్య కార్యనిర్వాహకాధికారి (సీఈవో) బాంగ్ గిల్ హో నేతృత్వంలో ప్రత్యేక బృందం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని గురువారం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసింది. పరిశ్రమ నెలకొల్పడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే రాష్ట్రానికి సాంకేతిక బృందాన్ని పంపనున్నట్లు కొరియా బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వీటితో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. కడప జిల్లాలో ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని జగన్ వారికి సూచించారు. ఇక్కడ ఏర్పాటు చేసే దానిపై కంపెనీ మూడు నెలల్లో తేల్చనుంది. రూ.30,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థ RINL(విశాఖ స్టీల్)తో కలిపి ఏర్పాటు చేసేందుకు పోస్కో కంపెనీ ఆసక్తిగా ఉంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ద్వారా దాదాపు 6,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. పోస్కో కంపెనీతో జగన్ చర్చల సమయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేనని చెప్పారు.