తెలంగాణ సమాజం అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మధురఘట్టం మరో 24గంటల్లో ఆవిష్కృ తం కానున్నది. ఏ నీళ్లకోసం దశాబ్దాలపాటు కొట్లాడినమో.. ఆ నీటి పరవళ్లు తెలంగాణను మాగాణం చేసేందుకు తరలివచ్చే క్షణం ఆసన్నమైంది. తెలంగాణ వరప్రదాయిని, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వహస్తాలతో శుక్రవారం నీటిని విడుదలచేయనున్న ఈ చారిత్రక సందర్భంలో విశిష్ట అతిథిగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర, ఏపీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, జగన్మోహన్‌రెడ్డి హాజరుకావడం కావడం విశేషం. ఇద్దరు ముఖ్యమంత్రులను స్వయంగా వెళ్లి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ బుధవారం గవర్నర్ నరసింహన్‌తో సమావేశమై కాళేశ్వరం ప్రారంభోత్సవంలో విశిష్ట అతిథిగా పాల్గొనాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్ మేడిగడ్డ బరాజ్ ప్రారంభోత్సవంతోపాటు కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటర్ల వెట్న్‌ల్రను కూడా ప్రారంభించనున్నారు. ఇదేసమయంలో ప్రాజెక్టు పరిధిలోని అన్నారం, సుందిల్ల బరాజ్‌లు, పంపుహౌస్‌లతోపాటు నంది మేడారం, రామడుగు పంపుహౌస్‌లలోనూ రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు పూజాకార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థికంగా రుణాలు అందించిన 20 బ్యాంకుల కన్సార్టియం ప్రతినిధులు కూడా ఈ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకొంటున్నారు. వీరు గురువారం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద హోమం కూడా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినందున దానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మేడిగడ్డ, కాళేశ్వరం వద్ద ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఆయన ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు తదితరులు మంత్రి వెంట ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన దృశ్యమని, తెలంగాణకు తలమానికమని మంత్రి ఈటల ఈ సందర్భంగా అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని ఎనిమిదో ప్యాకేజీని సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పండుగవాతావరణం నెలకొనాలని అధికారులకు సూచించారు.
16 హెలిప్యాడ్లు సిద్ధం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చే అతిథుల కోసం మొత్తం 16 హెలిప్యాడ్లను అధికారులు సిద్ధంచేశారు. మేడిగడ్డ బరాజ్ వద్ద ఏడు, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద తొమ్మిది హెలిప్యాడ్లను నిర్మించారు. మేడిగడ్డ, కన్నెపల్లి దగ్గర హోమశాలల నిర్మాణ పనులు పూర్తికావొచ్చాయి. రహదారుల నిర్మాణ పనులు కూడా చివరిదశకు చేరుకొన్నాయి. వెట్న్ ప్రారంభించేందుకు సాగునీటిశాఖ ఇంజినీర్లు కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటర్ల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏడు గేట్లు మూసివేయడంతో మేడిగడ్డబరాజ్‌లో నీటినిల్వ క్రమేణా పెరుగుతున్నది. హోమం తర్వాత ఈ బరాజ్ నుంచి సీఎం కేసీఆర్, అతిథులు గేట్లు ఎత్తి గోదావరి నీరు విడుదల చేస్తారు. గోదావరి నుంచి నీటిని అప్రోచ్ కెనాల్ ద్వారా పంపుహౌజ్ ఫోర్‌బేలో నింపారు. అతిథులతోపాటు కన్నెపల్లి గ్రామస్థులకు పంపుహౌస్ ప్రాంతంలో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, నీటిపారుదలశాఖ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు బుధవారం మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శించి బరాజ్‌లో నీటినిల్వ, బీటీ రోడ్లు, హోమశాలల నిర్మాణపనులు, కన్నెపల్లి పంపుహౌస్‌లోని ఫోర్‌బేలో నీటి నిల్వలను పరిశీలించారు. పోలీసులు భద్రతను మరింత పటిష్ఠంచేశారు. సందర్శకులను అనుమతించడంలేదు. డ్రోన్ కెమెరాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ మంగళవారం నుంచి కన్నెపల్లి పంపుహౌస్ వద్ద మకాంవేసి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.