జూన్ 21, 2019!! తెలంగాణ నేల పులకరించే తరుణమిది. రాష్ర్టానికి రెండు కండ్లలాంటి కృష్ణా, గోదావరి జీవనదులు పారుతున్నా.. దశాబ్దాల తరబడి కరువు చీకట్లో మగ్గిపోయిన ఈ గడ్డ.. వెలుగులవైపు ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న రోజు ఇది. ఒక్క పది టీఎంసీల కోసం యాచించిన స్థితినుంచి.. వందల టీఎంసీలను అలవోకగా బీడు భూముల్లోకి మళ్లించుకునే సాధనాసంపత్తి మా సొంతమని రుజువు చేసుకున్న సమయమిది. కడలివైపు పరుగులు పెడుతున్న గోదారమ్మను కాళేశ్వరం వద్ద ఒడిసిపట్టి.. ఏటా కోటి ఎకరాల మాగాణం బాధ్యత నీదే తల్లీ.. అంటూ హారతి పట్టే చారిత్రక సందర్భమిది.
సీఎం కేసీఆర్ కలలుగన్న స్వప్నం సాకారమైన అద్భుత ఘట్టమిది. ఆరు దశాబ్దాలపాటు కరువు ఛాయలతో అల్లాడిన తెలంగాణ నేల తల్లి ధాన్యసిరులతో కళకళలాడే కాళేశ్వర శకానికి ఆరంభమిది. ఐదేండ్ల కిందట పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్రం కేవలం మూడేండ్లలోనే 45 లక్షల ఎకరాలకు జీవంపోసే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రపంచానికే సాగునీటిరంగ పాఠాలను నేర్పించిందనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. తెలంగాణ రైతాంగం ఆశగా.. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నీటి విడుదల మరికొన్ని గంటల్లోనే సాక్షాత్కారం కానున్నది. తెల్లని నురుగులతో కిలకిల సవ్వడులతో గోదారమ్మ శతాబ్దాల తన గతిని మార్చుకొని తెలంగాణ పంటపొలాలవైపు పరుగులు తీయనున్నది. కాళేశ్వరుని సాక్షిగా ఏకంగా 19 చోట్ల ఏర్పాటుచేసిన పంపుహౌస్‌ల నుంచి ఎగిసిపడుతూ లక్షల ఎకరాల ఆయకట్టును తడిపే గోదారమ్మ హొయలను ఒక్కసారి కనులారా తిలకిస్తే..
లింక్-1
మేడిగడ్డ బరాజ్ నుంచి ఎల్లంపల్లి జలాశయం వరకు ఆయకట్టు: 30 వేల ఎకరాలు
ఇది మేడిగడ్డ బరాజ్…
కాళేశ్వరం ప్రాజెక్టులోనే అత్యంత కీలకమైన నిర్మాణమిది. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞతకు నిదర్శనంగా మహారాష్ట్రతో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందానికి కీలకాంశం ఇదే. గోదావరి నదిపై నిర్మించిన ఈ బరాజ్ ఎఫ్‌ఆర్‌ఎల్ 100 మీటర్లు. భవిష్యత్తులో మరో మీటర్ ఎత్తువరకు పెంచుకునేందుకు కూడా అంతర్రాష్ట్ర ఒప్పందంలో వెసులుబాటు ఉన్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయానికి 200 కిలోమీటర్ల దిగువన ఉన్న ఈ బరాజ్ వల్ల గోదావరినదిలో 365 రోజులపాటు 16.17 టీఎంసీల జలాలు నిల్వ ఉంటాయి. అటువైపు మహారాష్ట్ర – ఇటు తెలంగాణ సరిహద్దులుగా ఉండే ఈ బరాజ్ పొడవు 1.632 కిలోమీటర్లు. బరాజ్ అమర్చిన గేట్ల సంఖ్య 68. గరిష్ఠ వరద ప్రవాహ సామర్థ్యం 80 వేల క్యూమెక్స్ (28, 25, 173 క్యూసెక్కులు). దీని ఒప్పంద విలువ రూ.2,008.96 కోట్లు.
ఇది కన్నెపల్లి పంపుహౌస్…
మేడిగడ్డ బరాజ్‌లో నిల్వ అయ్యే నీళ్లు ఇక్కడిదాకా ఉంటాయి. అందుకే ఇక్కడ (ఫోర్‌షోర్) నుంచి జలాల్ని ఎత్తిపోసేందుకుగాను పంపుహౌస్ నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది రోజుకు రెండు టీఎంసీలు, మున్ముందు రోజుకు మూడు టీఎంసీల చొప్పున జలాల ఎత్తిపోత తొలి ప్రారంభం ఇక్కడినుంచే జరుగుతుంది. ఇందుకుగాను ప్రస్తుతం 40 మెగావాట్ల సామర్థ్యంతో 11 మోటర్లను బిగించారు. ఒక్కో మోటరు నుంచి సుమారు 2,118 క్యూసెక్కుల నీళ్లు డిశ్చార్జి అవుతాయి. అంటే 11 మోటర్ల నుంచి దాదాపు 23,166 క్యూసెక్కులు (రెండు టీఎంసీలు) ఎత్తిపోస్తారు. ఇక్కడ ఎత్తిపోసిన నీళ్లు 14.85 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా అన్నారం బరాజ్‌లోకి చేరుతాయి. దీని ఒప్పంద విలువ రూ.3,174.22 కోట్లు.
ఇది అన్నారం బరాజ్.
ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ తర్వాత చేపట్టిన రెండో బరాజ్. దీని ఎఫ్‌ఆర్‌ఎల్ 119 మీటర్లు. నీటినిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు. ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు 60 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. దీని పొడవు 1,119 మీటర్లు. ఈ బరాజ్‌కు అమర్చిన గేట్ల సంఖ్య 47. దీని ఒప్పంద విలువ రూ.1,464.93 కోట్లు.
ఇది అన్నారం పంపుహౌస్. అన్నారం బరాజ్ ఫోర్‌షోర్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకుగాను ఎనిమిది మోటర్లను అమర్చారు. ఒక్కోమోటరు నుంచి సుమారు 2,931 క్యూసెక్కుల నీళ్లు డిశ్చార్జి అవుతాయి. ఎనిమిది మోటర్ల నుంచి దాదాపు 23,166 క్యూసెక్కులు అంటే రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలిస్తారు. దీని ఒప్పంద విలువ రూ.1,804.58 కోట్లు.
ఇది సుందిల్ల బరాజ్. అన్నారం పంపుహౌస్ నుంచి ఎత్తిపోసిన జలాలు 2.50 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా ఈ బరాజ్‌లోకి చేరుతాయి. ఈ బరాజ్ ఎఫ్‌ఆర్‌ఎల్ 130 మీటర్లు. నిల్వసామర్థ్యం 8.83 టీఎంసీలు. ఈ బరాజ్ ఎల్లంపల్లి జలాశయానికి 25 కిలోమీటర్ల దిగువన ఉన్నది. ఈ బరాజ్ పొడవు 986 మీటర్లు. దీనికి 41 గేట్లు అమర్చారు. దీని ఒప్పంద విలువ రూ.1444.34 కోట్లు.
ఇది సుందిల్ల పంపుహౌస్ గోలివాడ దగ్గర నిర్మించిన ఈ పంపుహౌస్‌లో ప్రస్తుతం రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు తొమ్మిది మోటర్లను అమర్చారు. ఒక్కో మోటరు డిశ్చార్జి సామర్థ్యం సుమారు 2,613 క్యూసెక్కులు. అంటే రోజుకు 23,166 క్యూసెక్కు (రెండు టీఎంసీలు)లను తరలిస్తారు. దీని ఒప్పంద విలువ రూ.2051.19 కోట్లు. ఇక్కడి నుంచి తరలించిన జలాలు 2.12 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి చేరుతాయి.
లింక్-2
ఎల్లంపల్లి జలాశయం నుంచి మిడ్‌మానేరు రిజర్వాయర్ వరకు ఆయకట్టు: 86,150 ఎకరాలు
ప్యాకేజీ-6 పనుల్లో భాగంగా ఎల్లంపల్లి జలాశయం నుంచి మేడారం రిజర్వాయర్ వరకు రోజుకు రెండు టీఎంసీలను తరలించేందుకు నిర్మాణాలను చేపట్టారు. ఇందులో భాగంగా జలాశయం నుంచి హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి 1.1 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వ ద్వారా జలాలను తరలిస్తారు. అక్కడి నుంచి 9.534 కిలోమీటర్ల మేర ఉన్న జంట సొరంగాల (పది మీటర్ల డయా) ను దాటుకొని గోదావరిజలాలు నందిమేడారం పంపుహౌస్‌లోకి చేరుతాయి.ఆ నీటిని 115 మీటర్ల మేర ఎత్తిపోసేందుకుగాను ఇక్కడ ఏడు భారీ మోటర్లను ఏర్పాటుచేశారు. ఒక్కో మోటరు సామర్థ్యం 124.4 మెగావాట్లు. ఒక్కో మోటరు నుంచి మూడువేల క్యూసెక్కుల జలాల డిశ్చార్జి ఉంటుంది. ఇందులో నాల్గింటికి ఇప్పటికే డ్రైరన్, వెట్న్‌న్రు కూడా విజయవంతంగా పూర్తిచేశారు. మిగిలిన మోటర్ల బిగింపు ప్రక్రియ పురోగతిలో ఉన్నది. ఇక్కడ ఎత్తిపోసిన జలాలు మేడారం రిజర్వాయర్‌లోకి చేరుతాయి. మేడారం రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.78 టీఎంసీలు. ప్యాకేజీ-6లో భాగంగా చేపడుతున్న ఈ పనుల ఒప్పంద విలువ రూ.4,961.31 కోట్లు.
నందిమేడారం పంపుహౌస్
నుంచి ఎత్తిపోసిన నీళ్లు సిస్టర్న్.. ఆపై 1.950 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ.. అక్కడి నుంచి 11.24 కిలోమీటర్ల జంటసొరంగాల ద్వారా రామడుగు పంపుహౌస్‌లోకి చేరుతాయి. ఇక్కడ కూడా రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు బాహుబలి మోటర్లను ఏర్పాటుచేశారు. 139.9 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఎనిమిది మోటర్ల ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ఇలా ఎత్తిపోసిన నీళ్లు 5.75 కిలోమీటర్ల మేర నిర్మించిన గ్రావిటీ కాల్వ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాల్వలోకి చేరుతాయి. అక్కడి నుంచి మిడ్‌మానేరు జలాశయంలోకి పోతాయి. ఇక్కడ ఈ ఏడాదికిగాను తరలించే రెండు టీఎంసీల్లో ఒక టీఎంసీని మిడ్‌మానేరుకు, మరో టీఎంసీని ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా శ్రీరాంసాగర్ జలాశయంలోకి తరలించేందుకు నిర్ణయించారు. భవిష్యత్తులో మూడు టీఎంసీలను తరలించనున్నందున మిడ్‌మానేరుకు రెండు టీఎంసీలు, మిగిలిన మరో టీఎంసీని శ్రీరాంసాగర్ జలాశయానికి తరలిస్తారు. ఈ పనులను ప్యాకేజీ-7, 8లో భాగంగా చేపడుతుండగా.. వాటి ఒప్పంద విలువ రూ.6,330.79 కోట్లు.
లింక్-3
మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి అప్పర్ మానేరు రిజర్వాయర్ వరకు ఆయకట్టు: 86,150 ఎకరాలు
మిడ్ మానేరు మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి ప్యాకేజీ-9లో భాగంగా అప్పర్ మానేరు రిజర్వాయర్‌లోకి గోదావరిజలాల్ని తరలిస్తారు. ఇందుకుగాను మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి 2.60 కిలోమీటర్ల అప్రోచ్ చానల్, ఆపై 12.035 కిలోమీటర్ల సొరంగం ద్వారా మలక్‌పేట రిజర్వాయర్ సమీపంలోకి తరలిస్తారు. అక్కడ నిర్మించిన పంపుహౌస్ నుంచి నీటిని మలక్‌పేట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. ఇందుకుగాను మూడు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించారు. మలక్‌పేట రిజర్వాయర్ నుంచి 18.325 కిలోమీటర్ల అప్రోచ్ చానల్ ద్వారా తరలించి.. ఆ పాయింట్ వద్ద మరోసారి ఎత్తిపోయడం.. అక్కడినుంచి 6.596 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరిజలాలను అప్పర్ మానేరులోకి పోస్తారు. ఇందుకుగాను చేపట్టే పనుల ఒప్పంద
విలువ రూ.911.32 కోట్లు.
లింక్-4
మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు ఆయకట్టు: 5,95,754 ఎకరాలు
మిడ్ మానేరు జలాశయం నుంచి 1.155 కిలోమీటర్ల అప్రోచ్ చానల్, మరో 2.380 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ.. ఆపై 7.651 ద్వారా తరలించిన నీటిని ఎత్తిపోసి అనంతగిరి రిజర్వాయర్‌లోకి పోస్తారు. అనంతగిరి రిజర్వాయర్ కింద ఉన్న 30వేల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 2.22 టీఎంసీలు, అనంతగిరి రిజర్వాయర్‌లో 3.50 టీఎంసీల నిల్వపోను మిగిలిన జలాల్ని అక్కడి నుంచి తరలిస్తారు. ఈ పనుల ఒప్పంద విలువ రూ.2,715.40 కోట్లు.
-అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1.746 కిలోమీటర్ల అప్రోచ్ చానల్, 0.454 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వతోపాటు 8.590 కిలోమీటర్ల సొరంగం ద్వారా తరలించిన జలాల్ని ఎత్తిపోసి ఇమామ్‌బాద్ రిజర్వాయర్‌లోకి పోస్తారు. ఈ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు. ఆ తర్వాత ఇమామ్‌బాద్ రిజర్వాయర్ నుంచి 4.40 కిలోమీటర్ల అప్రోచ్ చానల్, 16.180 కిలోమీటర్ల సొరంగం ద్వారా జలాల్ని ఎత్తిపోసి మల్లన్నసాగర్‌లో పోస్తారు. ఈ క్రమంలోనే ప్యాకేజీ-11 కింద 1.10 లక్షలు, ప్యాకేజీ-12 కింద 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
-మల్లన్నసాగర్‌లోకి వచ్చిన గోదావరిజలాలతో సాగునీటి వినియోగం మరింత పెరుగనున్నది. ఏకంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ జలాశయం కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలకమైన నిర్మాణం. ముఖ్యంగా వరుసగా వర్షాభావ పరిస్థితులతో కరువు వచ్చినా ఈ భారీ రిజర్వాయర్ రైతాంగాన్ని ఆదుకోనున్నది. అందుకే మల్లన్నసాగర్‌పై ఆధారపడి తదుపరి కూడా భారీ రిజర్వాయర్లతో పెద్దఎత్తున సాగునీటి కల్పనకు డిజైన్ రూపొందించారు.
-ప్యాకేజీ-13లో భాగంగా మల్లన్నసాగర్ నుంచి 7.250 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ నిర్మిస్తున్నారు. తద్వారా సుమారు 53 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ ప్యాకేజీతోపాటు ప్యాకేజీ-14 కింద చేపట్టే గ్రావిటీ కాల్వల ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్‌కు గోదావరిజలాల్ని తరలిస్తారు. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం ఏడు టీఎంసీలు. ఈ నేపథ్యంలో ప్యాకేజీ-14 కింద 2.27,754 ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
లింక్-5
మల్లన్నసాగర్ దిగువన ఉన్న ఆనకట్ట నుంచి చిట్యాల వరకు ఆయకట్టు: 2,43,500 ఎకరాలు
ప్యాకేజీ-15, 16లో భాగంగా చేపట్టే పనులతో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 2,43,500 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందుకోసం మల్లన్నసాగర్ నుంచి ప్యాకేజీ-13 ద్వారా నిర్మించిన గ్రావిటీ కాల్వను పొడిగిస్తూ.. జలాలను కందుకూరు వాగు తద్వారా గంధంమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లలోకి పోస్తారు. ఇందుకోసం 9.87 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల, 11.39 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు.
లింక్-6
మల్లన్నసాగర్ నుంచి సింగూరు రిజర్వాయర్ వరకు ఆయకట్టు: 2,80,296 ఎకరాలు
ప్యాకేజీ-17, 18, 19 ద్వారా 1.32 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు అవసరమైతే గోదావరిజలాల్ని హల్దీ వాగులోకి పోయడం.. ఆపై సింగూరు జలాశయ స్థిరీకరణకుగాను గ్రావిటీ కాల్వలు, సొరంగ నిర్మాణాల్ని చేపట్టాలనుకున్నప్పటికీ, సొరంగమార్గాల నిర్మాణంలో సాంకేతిక ఇబ్బందులు (భూమి పొరల్లో అనుకూలత లేకపోవడం) వచ్చే అవకాశమున్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయంపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా మల్లన్న సాగర్ నుంచి కాకుండా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సింగూరుకు జలాల్ని తరలించేందుకుగాను యోచిస్తున్నది. దీని ద్వారా గతంలో రూపొందించిన 1.32 లక్షలతోపాటు అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించి, సింగూరు జలాశయ స్థిరీకరణచేసే అవకాశమున్నదని ప్రభుత్వం ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
లింక్-7
శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నుంచి నిజాంసాగర్ కాల్వలకు నీరందించడంతో పాటు నిర్మల్, ముదోల్ పరిధిలోని చెరువులను నింపడం ఆయకట్టు: 5.90 లక్షల ఎకరాలు
శ్రీరాంసాగర్ జలాశయం నుంచి గ్రావిటీకాల్వలు, సొరంగాల నిర్మాణం ద్వారా తరలించే జలాల్ని మూడుదశల్లో ఎత్తిపోసి మాసాని ట్యాంకు, కొండెం చెరువు, ఆపై భూంపల్లి రిజర్వాయర్ (0.09 టీఎంసీ)కు తరలిస్తారు. అక్కడి నుంచి గుజ్జల్ (1 టీఎంసీ), అమర్లబండ (1.60 టీఎంసీ), కాటేవాడి (1 టీఎంసీ), మోతె (1.50 టీఎంసీ), తిమ్మక్కపల్లి (0.50 టీఎంసీ), కచ్చాపూర్ (1.50 టీఎంసీ) రిజర్వాయర్లకు తరలిస్తారు. ఇందుకుగాను ప్యాకేజీ-20-22 కింద పనులు చేపడుతున్నారు. మరోవైపు శ్రీరాంసాగర్ జలాశయం నుంచి ప్యాకేజీ-27, 28 కింద చేపట్టే పనుల ద్వారా హంగారా గ్రామ పరిధిలో 50వేల ఎకరాలకు, దిల్వాపూర్ గ్రామ పరిధిలోని మరో 50వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. By Namasthe Telangana