ప్రభుత్వ స్కూళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ పాఠశాలలంటేనే దూరంగా వెళ్లిన వారంతా తిరిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు క్యూ కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అమ్మఒడి పధకం..వైసీపీ అధికారంలోకి రావడం.. జగన్ సీఎం కావడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం స్కూలుకు వెళ్లే చిన్నారులకు 15వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రధానంగా గ్రామాల్లో అయితే ప్రభుత్వ పాఠశాలలో చేరే వారి శాతం ఇంకా ఎక్కువగా వుంది. ప్రైవేటు స్కూళ్ళు భారీగా ఫీజులు వసూలు చేయడం, దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తామని సీఎం జగన్ చెబుతుండడంతో ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. ప్రభుత్వ స్కూల్లో చదివే వారికే ఈ మొత్తాన్ని ఇస్తారా.. లేక ప్రైవేటు స్కూల్లో చదివే వారికి కూడా ఈ పధకం వర్తిస్తుందా అనే క్లారిటీ అధికారికంగా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం త్వరలోనే పూర్వ వైభవం రావాలని మనమూ ఆశిద్దాం..