వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదా లో పోలవరం పర్యటనకు వచ్చారు. పోలవరం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన జగన్ కాపర్ డ్యామ్ నిర్మాణం, సాంకేతిక అంశాలపై అధికారుల అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు స్థితిగతులపై జగన్ ఆరా తీశారు. పోలవరం ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. స్పిల్‌వే కాంక్రీటు పనులు ఏ మేర వచ్చాయి, ఎప్పటిలో పూర్తిచేస్తారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ పరిరక్షణకు ఏ విధమైన చర్యలు చేపట్టారని అడిగారు. నీరు స్పిల్‌వేపైకి వచ్చి నిర్మాణాలకు అంతరాయం కలిగితే ఎలా అని, గోదావరికి వరద వస్తే పనులు ఏవిధంగా సాగిస్తారని ప్రశ్నించారు.
ఇకనుంచి పనులు వేగవంతంగా చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం ఆదేశించారు. అవినీతికి ఎవరు పాల్పడినా సహించనని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్ అంతకుముందు ఉండిలో వైఎస్సార్ సీపీ నేత కొయ్యే మోషేన్‌రాజు కుమారుని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, పుప్పాల వాసుబాబు, ప్రసాద రాజు, దూలం నాగేశ్వరరావు, మంతెన రామరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు, జిల్లా కలక్టర్ రేవు ముత్యాలరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోయ్యే మోషన్ రాజు, జిల్లా యూత్ అధ్యకుడు యోగేంద్ర బాబు, డీఐజీ అబ్దుల్ సత్తార్ ఖాన్‌లు జగన్ కు స్వాగతం పలికారు.