పోలవరం కాలువపై నీటిని తోడడానికి ఏర్పాటు చేసిన పైపులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దొంగిలించారంటూ కేసిన సత్యనారాయణ అనే రైతు ఇచ్చిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువ నుంచి కృష్ణానదిలోకి వెళ్తున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేయడానికి అనువుగా మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పైపులను ఏర్పాటు చేసి నీటిని చెరువులకు మళ్లించారు. పెదవేగి మండలంలోని గ్రామాలతోపాటు దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల్లోని గ్రామాల్లో సాగుకు ఈ పైపుల ద్వారా నీరందిస్తున్నారు.
ఈ పైపులను అప్పట్లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికార పార్టీకి చెందిన రైతులు వేయించారు. నీటిని పెట్టుకున్నందుకు ఏటా ఎకరానికి రూ.వెయ్యి చొప్పున రైతుల నుంచి చింతమనేని వసూలు చేస్తున్నారు. అయితే సోమవారం అర్ధరాత్రి ఉన్నట్టుండి పైపులను చింతమనేని అనుచరులు తరలించుకుపోయారు. దీంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారంతా రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఏటా ఎకరానికి రూ.వెయ్యి చొప్పున తాము చెల్లించామని, ఈ లెక్కన పైపుల ధర కంటే ఎక్కువే ఇచ్చామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పైపులను తీసుకెళ్లిపోవడం దారుణమని, ఎన్నికల్లో ఓడిపోవడంతో చింతమనేని ఇలాంటి దారుణమైన చర్యలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. పైపులు తీసుకెళ్లిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు డిమాండ్ చేశారు. పోలీసులకు ఘటన గురించి వివరించారు. దీంతో కేసిన సత్యనారాయణ అనే రైతు అందించిన ఫిర్యాదుపై పెదవేగి పోలీసులు చింతమనేని ప్రభాకర్‌తోపాటు మరో ఐదుగురు దిరుసు సత్యనారాయణ, చిలకలపూడి నరేంద్ర, కమ్మ పకిరియ్య, గద్దే కిషోర్‌పై కేసు నమోదు చేశారు. చింతమనేనిని ఏ1గా చూపించారు. 420, 384, 431, రెడ్‌విత్ 34 ఐపీసీ, పీడీపీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇదే విషయంపై ముఖ్యమంత్రి జగన్ సిరీయస్ అయినట్లు తెలుస్తుంది. రైతులకు అన్యాయం చేసేవారిని , నేరస్తులను వదిలిపెట్టాను ఇప్పటికే ప్రకటించాడు. దీంతో నేరం రుజువైతే వెంటనే అరెస్ట్ చెసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.