తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలడం ఖాయమైంది. మునుగోడు శాసనసభ స్థానం నుంచి విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. బీజేపీలో చేరికపై గత కొంతకాలంగా తీవ్రమైన చర్చ సాగుతుండగా….తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసిన రాజగోపాల్ రెడ్డి ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ప్రధాని మోడీ, బీజేపీ నేతలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్… ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని.. లేని పక్షంలో వేటు తప్పదని హెచ్చరించింది. ఈ సమయంలో తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
బీజేపీలో చేరేందుకు సిద్ధమైన రాజగోపాల్ రెడ్డి బుధవారం అర్ధరాత్రి వరకు తన ముఖ్య అనుచరులతో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కమలం గూటికి వెళ్లాలని తీసుకున్న నిర్ణయంపై కార్యకర్తల అభిప్రాయాలను కూడా తీసుకోవడంలో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ పెద్దఅంబర్ పేటలో మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన బీజేపీలో చేరికపై అధికారికంగా ప్రటన చేసే అవకాశం ఉందంటున్నారు.