పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో విద్యాశాఖాధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ విభాగాల్లో మొత్తం 222 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ కేడర్ గల తెలుగు, హిందీ, సంస్కృతం, పీఈటీ పోస్టులు మొత్తం 43 ఖాళీలు ఉండగా, ప్రస్తుతానికి వీటిని భర్తీ చేయడం లేదు. మిగిలిన 179 పోస్టుల్లో అర్హులైన వారిని ఎంపిక చేసి, నియామక పత్రాలను అందజేసేందుకు విద్యాశాఖాధికారులు దృష్టి సారించారు. 2018 డీఎస్సీ ఫలితాల మేరకు అర్హులైన అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించనున్నారు. ఉపాధ్యాయ పోస్టులను దక్కించుకునేందుకు జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి కూడా సుమారుగా 30 వేల మంది అభ్యర్థులు డీఎస్సీకి హాజరయ్యారు. వీరిలో సబ్జెక్టుల వారీగా అర్హులైన వారి మెరిట్ జాబితా ఇదివరకే సిద్ధమైంది. తాజాగా ప్రభుత్వం నుంచి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు రావటంతో విద్యాశాఖాధికారులు డీఎస్సీ ఫైళ్లను బయటకు తీస్తున్నారు. మరో పక్కన్యాయస్థానంలో వివాదంలో ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో గల తెలుగు (12), హిందీ (6), ఎల్పీ తెలుగు (4), ఎల్పీ హిందీ (4), ఎల్పీ సంస్కృతం (3), పీఈటీ (14) పోస్టులు మొత్తం 43 ఖాళీగా ఉండగా, వీటి నియామకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా వీటిని భర్తీ చేసేలా, జాబితా సిద్ధం చేస్తున్నారు.
