తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 రెండు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో… పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశముంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు, పురపాలక సంఘాల పాలక మండళ్ల పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నికలు నిర్వహించాలి. అందువల్ల కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదముద్ర వేసి, అసెంబ్లీలో కూడా పాస్ చేయించాలని సీఎం భావిస్తున్నారు.
See Also : తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
మరోవైపు వచ్చే నెల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్న తరుణంలో… మున్సిపల్, రెవెన్యూ చట్టాల ఆమోదం కోసం ఈనెల్లోనే ఓ రెండు రోజులపాటు అసెంబ్లీని నిర్వహించాలా? లేక బడ్జెట్ సెషన్‌లోనే వాటిని ఆమోదించాలా? అనే అంశాలపై కూడా ప్రభుత్వానికి స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలో శాసనసభా సమావేశాల తేదీలను కూడా నిర్ణయించాలి. వీటితోపాటు ప్రస్తుత సచివాలయాన్ని కూల్చటం, దాని స్థానంలో కొత్తది నిర్మించటమనే విషయం కూడా క్యాబినెట్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న మధ్యంతర భృతి (ఐఆర్)పై కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
See Also : పీఆర్సీపై త్వరలోనే సమావేశం.. సీఎం కేసీఆర్
ప్రస్తుతం అత్యధిక జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కైవసం చేసుకుని ఊపుమీదున్నాం కాబట్టి… ఇదే ఊపులో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలనే అంశం సైతం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. కొత్త చట్టానికి ఆమోదముద్ర వేసి.. వెంటనే ఎన్నికలు వెళతారా? లేక కొద్ది రోజులు వేచి చూస్తారా..? అనేది కూడా తేలాల్సి ఉంది.
See Also : చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !