ఈ నెల 21న నిర్వహిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. ఒక రోజు పర్యటన నిమిత్తం సోమవారం విజయవాడ చేరుకున్న కేసీఆర్.. ఏపీ నూతన రాజధాని అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమయ్యారు. కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికిన జగన్.. ఆయనను సాదరంగా లోనికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను జగన్‌కు కేసీఆర్ అందజేశారు. అనంతరం దాదాపు గంటన్నరపాటు ఇద్దరు సీఎంలు విభజన సమస్యలు సహా వివిధ అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం. రెండు రాష్ర్టాల మధ్య జలవివాదాలు ఉండొద్దని నిర్ణయించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో తమ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది.
దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తికావచ్చింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై ఇద్దరు సీఎంలు చర్చించినట్టు సమాచారం. ప్రభుత్వరంగసంస్థల విభజనపై దృష్టిపెట్టడంతోపాటు.. విద్యుత్ ఉద్యోగుల విభజనపైనా చర్చించినట్టు తెలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై సమాలోచనలు జరిపిన సీఎంలు.. కృష్ణా, గోదావరి జలాలపై కోర్టులు, ట్రిబ్యునళ్లకు వెళ్లేందుకు ఆస్కారం లేకుండా అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 24న హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశం జరుగనున్నది.