ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు రావడంతో తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి. తొలిసారి 2004లో యువ సినిమా షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చింది. సెట్లోనే ఛాతిలో నొప్పి రాగా, వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత 2015లో ఓకే బంగారం సినిమా షూట్ సందర్భంగా రెండోసారి కశ్మీర్లో గుండెపోటు రావడంతో కశ్మీర్ నుంచి వెంటనే ఢిల్లీకి తరలించి చికిత్సను అందించడంతో ఆయన కోలుకొన్నారు. 2015 తర్వాత ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2018లో మళ్లీ గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా నాలుగోసారి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
