కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ప్రవేశ పెడితే స్థానిక నాయకులు ఆయా ప్రాంతాల్లో తమకు అనువైన ట్యాక్స్‌లు అమలుచేశారు. జమ్మలమడుగులో అభివృద్ధి పనులు చేపట్టాలంటే దేవగుడి–గుండ్లకుంట ట్యాక్స్ చెల్లించాల్సిందే. చెల్లించకపోతే పనులు చేయడం కష్టమే. ఇలాంటి తంతు గడిచిన మూడేళ్లుగా కొనసాగింది. అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు–చెట్టు పథకం మొదలుకొని ఎలాంటి పనులు చేపట్టినా 50@50వాటాలతో చెపట్టాల్సిందే. ఇలాంటి ఒప్పందం ఏకంగా అప్పటి ప్రభుత్వ పెద్దే కుదిర్చారు. అదే విషయాన్ని తమ అనుచరులకు టీడీపీ నేతలు స్వయంగా తెలియజేశారు. ఆమేరకు అన్నీంటా చక్రం తిప్పుతూ వచ్చిన తెలుగుదేశాధీశులు తమను కాదన్నవారిని కాంట్రాక్టు పనులు చేయనిచ్చేవారు కాదు. టాటా ప్రాజెక్ట్సు విషయంలో ఈ విషయం తేటతెల్లమైంది. గుంటూరు జిల్లాలో కేట్యాక్స్ (కోడెల ట్యాక్స్) తరహానే జమ్మలమడుగులో టీడీపీ నాయకులు డీజీ ట్యాక్స్ ప్రవేశ పెట్టారు. అయితే పరస్పర ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపిన నేతలు పర్సెంటేజీల కోసం ఏకమయ్యారు. పట్టుమని పది రోజులు కూడా గడవకముందే అధికార వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. వాస్తవంలో టీడీపీ నేతలు బెదిరింపులకు, కమీషన్లు కక్కుర్తీకి కాంట్రాక్టర్లు దూరమైయ్యారని టాటా ప్రాజెక్ట్ వ్యవహారం బహిర్గతం చేస్తోంది. మూడేళ్లు అక్కడ ఎలాంటి అభివృద్ధి చేపట్టాలన్నా సగం సగం వాటాలతో పంచుకుంటున్న నేపథ్యం అక్కడి ప్రజలకు ఎరుకే. అయినా ప్రత్యర్థిపార్టీ నేతలపై ఆరోపణలు చేయడం వింతగా ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
