ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో మేడిగడ్డ బ్యారేజీ దగ్గర మొదటి పూజ, హోమం చేయనున్నారు. తర్వాత కన్నెపల్లి పంపుహౌజ్ ప్రారంభోత్సవం జరగనుంది. కన్నెపల్లి పంపుహౌజ్ దగ్గర తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు మూడు పంపులకు స్విచ్ ఆన్ చేయనున్నారు. అక్కడ 45 నిమిషాలు పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. గోదావరి జలాలను గ్రావిటీ కాలువలో ఎత్తిపోసే స్థలం దగ్గర 30 నిమిషాలకు పైగా పూజా కార్యక్రమాలు ఉంటాయి. కన్నెపల్లి పంపుహౌజ్ దగ్గర సీఎం కేసీఆర్ వరుణున్ని ఆహ్వానించే హోమం చేస్తారని సమాచారం.
కాళేశ్వరం ప్రారంభోత్సవం తర్వాత స్వామి సన్నిధానంలో గోదావరి జలాలతో ఆయన అభిషేకం నిర్వహిస్తారని తెలుస్తుంది. తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనలతో శృంగేరి పీఠం పండితులు నిన్న మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్ ప్రాంతాలను సందర్శించారు. ప్రత్యేక పూజలకు అనువైన స్థలాలను పరిశీలించారు. మేడిగడ్డ, కన్నెపల్లి దగ్గర నిర్వహించనున్న యాగాలకు జలసంకల్ప యాగాలుగా నామకరణం చేశారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లతో కన్నెపల్లి పంపుహౌజ్ వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు.