తెలంగాణ రాష్ట్ర రైతుల దశా దిశను మార్చే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన కుట్రలు కొనసాగిస్తోంది. ప్రాజెక్టును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు అంగరంగ వైభవంగా సాగే ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని సైతం అడ్డుకునే ప్రయ్తనం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సంఖ్యతను పెంచే రీతిలో ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను సైతం ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ పిలిచారు.
అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఘట్టాన్ని స్వాగతించాల్సిందిపోయి కాంగ్రెస్ నేతలు దుర్బుద్దిని ప్రదర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావొద్దంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై తాజాగా, టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతల తీరును ఖండించారు. గతంలోనూ ప్రధాని మోదీని మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావోద్దని ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేఖ రాశారన్నారు. ఇంటింటికి నీళ్లు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను చేపట్టారన్నారు. ప్రాజెక్టులు నిర్మించినప్పుడు నిర్వాసితులు ఉండటం సహజమేనని.. నిర్వాసితులకు మంచి ప్యాకేజి ఇచ్చినా.. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు కేసులు వేశారన్నారు. కాంగ్రెస్ నేతలు రాజనీతిని ప్రదర్శించడం లేదన్నారు.