టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నీటి దౌత్యంలో మరో కీలక ముందడుగు పడనుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 70 శాతం భూభాగానికి సాగు, తాగు నీటితో పాటు పరిశ్రమలకు సైతం నీరందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 21న ఉద యం 11 గంటలకు మేడిగడ్డ బ్యారే జీ వద్ద పంపుల స్విచ్ ఆన్ చేసి, ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ప్రాజెక్టు ప్రారంభంలో భాగంగా మరిన్ని ప్రత్యేకతలను ఈ ప్రాజెక్టు సొంతం చేసుకోనుంది.
ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని,మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్‌ను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం త్వరలోనే విజయవాడకు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి సిఎం జగన్‌ను ఆహ్వానించనున్నా రు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్‌తో కూడా సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రారంభానికి ఆయనను ఆహ్వానించగా, సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు ప్రారంభానికి రావడానికి ఒప్పుకున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ముంబై వెళ్లి స్వయంగా ఆహ్వానపత్రం అందించారు. ఇలా ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రాజెక్టు ప్రారంభమైతే అంతర్రాష్ట్ర సంబంధాల్లో ఇదో మైలురాయిగా మిగిలిపోతుంది.
కన్నులపండువగా జరిగే శక్తివంతమైన ఎత్తిపోతలతో గోదారమ్మ జలాలు ఎప్పుడెప్పుడు తమ మాగాణాన్ని తడుపుతాయో అని రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఆశతో ఎదురుచూసే మంచిరోజులు వచ్చేనెలతో సమీపిస్తున్నందున వాటిని తలచుకొని అన్నదాతలు మురిసిపోతున్నారు. ఈ అపూర్వ జలయజ్ఞంతో ఏటా రెండు పంటలకు గాను బంగారుతెలంగాణలో ప్రతీ పంట కాలానికి 45లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సిరుల పంటలు పండి కరువు దూరమయ్యే హరితరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతున్నది. అందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ(వరదాయినిగా) వేదిక కానుంది.