ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి జూపూడి ప్రభాకర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పంపించారు. వైసీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడంతో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైన వారు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. చలనచిత్ర టీవీ నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ, బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య, వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు ఇప్పటికే తమ పదవులను వదులుకున్నారు.
