టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో గురువారం ప్రగతిభవన్ లో జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, లోక్సభ పక్ష నేత, రాజ్యసభ పక్ష నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సీనియర్ ఎంపీ కె.కేశవరావును ఎన్నుకున్నారు.లోక్సభ పక్ష నాయకుడిగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు ను, ఉప నాయకుడిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని, విప్ గా జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ ను ఎన్నుకున్నారు.
రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఎంపీ కె.కేశవరావును, ఉప నాయకుడిగా బండ ప్రకాశ్ ను, విప్ గా జోగినపల్లి సంతోష్ కుమార్ ను ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుల ఎంపికకు సంబంధించిన సమాచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు.