టీడీపీ విప్ బుద్ధా వెంకన్న.. అధికార తెలుగుదేశం అధిష్టానం అండ చూసుకుని యధేచ్చగా అక్రమాలకు పాల్పడిన వ్యక్తి.. దౌర్జన్యాలు, వడ్డీ వ్యాపారాలతో విజయవాడ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కాల్ మనీ పేరుతో మహిళల మానాలతోనూ వ్యాపారం చేసిన ఘనుడు ఈయన.. గతంలో ఈయన అనుచరుడిని కాల్ మనీ, సెక్స్ రాకెట్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసారు. ఈ కేసులో రెండో నిందితుడు భవానీ శంకర్‌ను మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. మాచవరం పోలీసులు నమోదు చేసిన ఈకేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు, టీడీపీ నేత యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రామును, దూడల రాజేష్‌లను కూడా అరెస్టు చేశారు. వీరంతా బుద్ధా వెంకన్నకు సన్నిహితులే కావడం గమనార్హం.
అలాగే బుద్ధా వెంకన్న తాను ప్రజా ప్రతినిధిని అని మరిచిపోయి ఇష్టానుసారం చెలరేగిపోయారు. వైసీపీ అధినేత, గత ప్రతిపక్షనేత ఇప్పటి రాష్ర్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. జగన్ ఎంతో కష్టపడి చేసిన పాదయాత్రను కూడా ఎగతాళి చేసారు. ముఖ్యంగా జగన్ వ్యక్తిగత వ్యవహరాలకు సంబంధించి కూడా వెంకన్న దూషణలకు దిగారు. అయితే.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసు మళ్లీ తెరపైకి రానుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ అనంతరం జరిగిన ప్రెస్మీట్ లో ప్రత్యేకించి కాల్ మనీ గురించి ప్రస్తావించడంపై ఈ అనుమానం కలుగుతుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా సవాంగ్ పనిచేస్తున్న తరుణంలో ఈ కేసు తెరపైకి వచ్చింది. అప్పుడే ఆయన ఉక్కుపాదం మోపారు.
ఆ కేసుస్టడీలో అన్ని ఆధారాలు సేకరించిన గౌతమ్ సవాంగ్ నేరుగా కాల్ మనీ కేసును పర్యవేక్షించే అవకాశం ఉందనిపిస్తోంది. ఇదే జరిగితే కాల్ మనీ కేసులో తెలుగుదేశం పార్టీ నేతల కీలక ప్రమేయం ఉన్న నేపథ్యంలో వారు జైల్లో ఊచలు లెక్కించేందుకు జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందనేది కూడా స్పష్టమవుతోంది. వైసీపీ అధికారంలోకి రావడంతో బాధితులు ఇప్పటికీ కాల్ మనీ కేసుపై న్యాయం కోసం పోరాడుతున్న నేపథ్యంలో కేసును తెరపైకి తెచ్చే యోచనలో జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బోండా ఉమ ప్రధాన అనుచరులు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఆయన అనుచరులతో పాటు బుద్దా వెంకన్న కూడా ఊచలు లెక్కపెట్టే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.