రాష్ట్రంలోని దాదాపు 13 జిల్లాల్లో సుమారు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవం పోసేందుకు నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. జూన్ 21న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్‌రావు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటి ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానుండటం అద్భుతమైన చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. గోదావరి బేసిన్‌లోని కీలక పొరుగు రాష్ర్టాలైన ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు.
బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడి.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రావాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో త్వరలోనే ముంబై వెళ్లి ఫడ్నవీస్‌ను స్వయంగా ఆహ్వానించాలని, అదేవిధంగా విజయవాడ వెళ్లి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా ఒక నదీ బేసిన్‌లోని ఎగువ, దిగువ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఒక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావడమనేది బహుశా దేశచరిత్రలో ఇదే తొలిసారి అని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు.