ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అసెంబ్లీ ద్వారంవద్ద పూర్ణకుంభంతో వేదపపండితులు స్వాగతం పలికారు. అనంతరం జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిలు రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్తచరిత్రను లిఖిస్తూ జగన్ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించారు. ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో స్థానాన్ని అలంకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం ప్రారంభమైంది.
ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 11.05గంటలకు 15వ శాసనసభ తొలిసమావేశం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చినవెంకట అప్పలనాయుడు సభాపతి స్థానంలో ఉన్నారు. జాతీయగీతంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం తొలుత ముఖ్యమంత్రి, సభానాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదవీస్వీకార ప్రమాణంచేశారు. ఆ తర్వాత మాజీముఖ్యమంత్రి, విపక్షనేత చంద్రబాబునాయుడు ప్రమాణంచేశారు. అనంతరం మంత్రులు, సభ్యులతో అక్షరక్రమంలో పదవీ స్వీకారప్రమాణం చేస్తున్నారు. అనంతరం సభ్యులంతా ప్రమాణాలు చేస్తున్నారు.