ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రతి రోజు ఉదయం కొంతసేపు సామాన్యులను కలుసుకుని వారి సమస్యలు విని…వాటికి పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించే సంప్రదాయాన్ని తిరిగి మొదలుపెట్టనున్నారు. వచ్చే నెల నుంచి ఆయన మొదలుపెట్టనున్నారు.
సామాన్యులు తనను కలుసుకునేందుకు అవకాశం కల్పించిన సీఎంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ నిలిచారు. అయితే ఆ తరువాత ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వాళ్లెవరూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేదు. ఈ నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిగా ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని జగన్ డిసైడయ్యారు. ఈ మేరకు ప్రతి రోజూ ఉదయం అరగంట సేపు ప్రజలను కలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన సీఎం కార్యాలయం అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.
వచ్చే నెల మొదటి వారం నుంచి జగన్ ప్రజా దర్బార్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజా దర్బార్‌లో భాగంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించి… అక్కడికక్కడే పరిష్కారం అయ్యే సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని సంబంధితత శాఖ అధికారులకు పంపుతారు. ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యే వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.