రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు త్వరలో పార్టీ మారెందుకు సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబం, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధిష్టానం ఇప్పటికే వీరితో సంప్రదింపులు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో చేరిక తేదీని ఖరారు చేసుకుని త్వరలోనే వీరు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎదుట కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. 14 నియోజక వర్గాల్లో 12 చోట్ల వైసీపీ ఘన విజయం సాధించింది. హిందూపురం, ఉరవకొండలో మాత్రమే నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ గెలుపొందారు. 2 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ విజయ బావుటా ఎగురవేసింది. బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం ఖాయమనే అంచనాకు వచ్చిన టీడీపీ నేతలు ప్రత్యామ్నాయం దిశగా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో బాగాంగానే రాంమాధవ్ చర్చలు జరిపినట్లు సమాచారం. జేసీ బ్రదర్స్ చేరిక తర్వాత ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ నెల 23 లేదా 27న వీరు బీజేపీలో చేరతారని తెలుస్తోంది.
