ఖరీఫ్ సాగు మొదలయిన నేపథ్యంలో రైతులకు పంట పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన వారి ఖాతాలలో డబ్బులు జమ చేయాలని, ఎన్నికల కోడ్ మూలంగా జరిగిన జాప్యంతో రైతులు నష్టపోకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుండి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే నాలుగు విడతలుగా రైతుల ఖాతాలలోకి ఆర్బీఐ ఈ కుబేర్ ద్వారా నేరుగా రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయని పేర్కొన్నారు. మొత్తం 21.22 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.2233.16 కోట్లు రైతుబంధు డబ్బులు జమచేయడం జరిగిందని, రైతుబంధు అకౌంట్ నంబర్ మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.
ప్రభుత్వం సహకారసంఘాలు, మహిళాసంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలుచేసిన ధాన్యానికి సంబంధించి రూ.4837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించడం జరిగిందని, రూ.1080 కోట్లు బకాయిలు ఉన్నాయని నిరంజన్ రెడ్డి గారు వెల్లడించారు. మంగళవారం నాడు రూ.501 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. రైతులు ధాన్యం డబ్బుల విషయంలో, రైతుబంధు డబ్బుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన పనిలేదని అన్నారు. రాష్ట్రానికి రుతుపవనాలు మరికొద్ది రోజులలో రానున్న నేపథ్యంలో రైతుబంధు డబ్బులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.