కర్నూల్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంలకు కేబినెట్‌లో చోటు లబించింది. జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి రావడం విశేషం. గుమ్మనూరు ఆ ఘనతను దక్కించుకున్నారు. విద్యావంతుడిగా పేరున్నడోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కు మంత్రి దక్కింది. గతంలో తెలుగుదేశం పార్టీ రూ.కోట్లలో డబ్బు ఆశ చూపినప్పటికీ ప్రలోభాలకు లొంగలేదు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జగన్ వెంట నడిచారు. ఇది ఈయనకు కలిసి వచ్చింది. బుగ్గన, గుమ్మనూరు ఇద్దరూ వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం విశేషం. అంతేకాదు జిల్లా రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు గాను అన్నింటినీ ఆ పార్టీ కైవసం చేసుకుంది. సామాజిక సమతుల్యంతో పాటు సామాజిక న్యాయం దిశగా సీఎం వైఎస్ జగన్ ఆలోచించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో బుగ్గన, గుమ్మనూరుకు అవకాశం కల్పించారు. వాస్తవానికి జిల్లాలో ఇప్పటివరకు వాల్మీకులకు మంత్రి పదవి దక్కలేదు. ఈ వర్గానికి తెలుగుదేశం పార్టీ పదవులు ఇవ్వకుండా కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వచ్చింది. ఒకానొకదశలో ఫ్యాక్షనిస్టు ముద్ర వేసి వెంకటప్ప నాయుడికి జెడ్పీ చైర్మన్ పీఠం ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అయితే.. సామాజిక న్యాయం దిశగా ఈ వర్గానికి మొదటిసారిగా మంత్రి పదవి కట్టబెట్టిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతోంది.
డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
జగన్ పార్టీ స్థాపించిన సమయంలో మంచి పరిపాలన అందించడంతో పాటు తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భావించారు. ఆయనతో పాటు దాదాపు పదేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. పార్టీ స్థాపించిన నాటి నుంచి జగనన్న ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక లీడర్‌కు కావాల్సిన లక్షణాలు.. ధైర్యం, పట్టుదల, సాహసమని ఒక బెంచ్ మార్క్‌ను జగనన్న చూపించారు. పదేళ్లుగా జగనన్న నుంచి ఎన్నో నేర్చుకున్నాం. నా మీద నమ్మకంతో మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ పదవికి న్యాయం చేయడానికి శాయశక్తులా కృషిచేస్తా. నిజాయితీ, చిత్తశుద్ధి, నిబద్ధతతో కర్తవ్యాలను నిర్వహిస్తా. వెనుకబడిన జిల్లా కర్నూలు అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో కృషి చేస్తా. రాయలసీమ వాసినని గర్వంగా చెప్పుకుంటూ అభివృద్ధి చేసేందుకు పాటుపడతా. 50 ఏళ్ల క్రితం మా తాత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత నాకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన డోన్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.
ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
జగనన్న ఆశీర్వాదంతో నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఆ రోజు ఆయన వెంట నడిచా. పీఆర్‌పీ నుంచి నేను పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ‘నన్ను నమ్ముకో జయరాం’ అని ఆ రోజు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగనన్న అన్నారు. అప్పటి నుంచి వారి కుటుంబంతోనే ఉన్నా. ఈ రోజు జగనన్న ఆశీర్వాదంతో మంత్రి అవుతున్నందుకు సంతోషంగా ఉంది.కర్నూలు జిల్లా అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. ప్రధానంగా వలసలను నివారించేందుకు పాటుపడతా. ఆర్డీఎస్, వేదావతి వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తా. ఇక తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటా నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నారు.