వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం అయినా ఆచి తూచి తీసుకుంటున్నారు. కేంద్ర సహకారం తీసుకుంటూ రాష్ట్రానికి కావలసినవి సాధించుకోవాలనే సంకల్పంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్ళిన జగన్ అక్కడ స్వామీ కార్యంతో పాటు తాను తీసుకున్న నిర్ణయానికి మోదీ చేత గ్రీన్ సిగ్నల్ తీసుకుని మరీ వచ్చారంట. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన తొలి ప్రసంగంలోనే బహిరంగంగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు లభ్యమవుతున్న స్థితిలో ఎక్కువ ధర పెట్టి పిపిఎలు చేసుకోవడం ఏమిటన్న జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్ష చేస్తామని, అవసరమైతే వాటిని మార్చేస్తామని ప్రకటించారు. అందుకే ఇదే విషయాన్ని జగన్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసకెళ్ళినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఇటీవల ప్రధాని మోదీ తిరుమల పర్యటనకు వచ్చిన సమయంలో మోదీతో పాటు స్వామివారిని దర్శనం చేసుకున్న జగన్.. పీపీఏల వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సౌర, పవన్ విద్యుత్ యూనిట్ ధర మార్కెట్ లో రూ.3-రూ.3.50 ఉండగా, గత ప్రభుత్వం రూ.6కు కొనుగోలు చేసిందని సీఎం జగన్ ఆరోపించిన నేపధ్యంలోనే ఈ విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తామనీ, అవసరమైతే రద్దు చేస్తామని జగన్ ఇప్పటికే హెచ్చరించారు. ఇక ప్రధాని మోడీ కూడా జగన్ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. ఎందుకంటె గత ఎన్నికల సమయంలో బీజేపీయేతర కూటమి పేరుతో దేశ వ్యాప్తంగా బీజేపీ సర్కార్ పై యుద్ధం చెయ్యాలని విఫల యత్నం చేసిన చంద్రబాబును టార్గెట్ చెయ్యటంలో భాగంగానే జగన్ చెప్పిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దెబ్బకు చంద్రబాబు విలవిలలాడే పరిస్థితి నెలకొంది .
