వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంనుంచి గెలిచారు. తెలుగుదేశం అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్‌పై 7వేల398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాజీమంత్రి రావెల కిశోర్‌బాబు చేతిలో ఓటమిపాలయ్యారు. ఫిరంగిపురం మండల జెడ్పీటీసీగా తొలిసారి రాజకీయ రంగ ప్రవేశంచేశారు. తదనంతరం దివంగత వైఎస్సార్ ఆశీస్సులతో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ మరణాంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆతరువాత 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి 16,781ఓట్ల మెజార్టీతో సంచలన విజయాన్ని నమోదుచేశారు. అప్పటి నుంచి వైఎస్ జగన్ వెంటనడుస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఆమె శ్రమకు తగిన ఫలితంగా వైఎస్ జగన్ ఆమెకు హోమ్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. మహిళ, సామాన్యులకోసం పోరాటం, మంచి వ్యక్తిగా తండ్రి దగ్గరనుంచి ఆమె వైఎస్ కుటుంబానికి విధేయురాలిగా ఉండడంతో ఈ అవకాశం దక్కింది.
