వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన కొడాలి నాని.. కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. గుడివాడ స్థానం నుంచి 2004, 09 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌పై 19,479 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకుంది. సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన 25 మందిలో కొడాలినానికి చోటు కల్పించారు. గతంలో నానిపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టారు.
గతంలో వైసీపీ అధినేత జగన్ జైల్లో రిమాండ్‌లో ఉన్నపుడు జగన్ ని జైల్లో కలిసి పార్టీలో చేరారు. అప్పటినుంచి పార్టీకి సేవలందిస్తున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడకు నిధులు కేటాయించి ఎంతో అభివృద్ధి చేశారు. దీనిపై కొడాలి నాని బహిరంగంగా వైఎస్ ను కొనియాడారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అనికూడా చూడకుండా గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన వైఎస్ కుటుంబానికి తానెప్పుడూ అండగా ఉంటానని నాని ప్రకటించారు. అలాగే 2013లో శాసనసభలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా టీడీపీ ఎమ్మెల్యే హోదాలో కొడాలి నాని ఓటువేశారు. దీంతో కొడాలి నానిని టీడీపీ బహిష్కరించింది. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు.
వైసీపీ మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నా అసెంబ్లీలో జగన్‌పై టీడీపీ నేతల మాటల దాడికి కొడాలి నాని ఎదురొడ్డి నిలిచారు. ఫలితంగానే నానికి జగన్ తన జట్టులో చోటు కల్పించారు. 2019 ఎన్నికల్లోనూ నానిపై టీడీపీ అధినేత రంగంలోకి దిగి ఓడించాలని చూసినా ఆయనవల్ల కాలేదు. నానికి మాస్ లీడర్ గా జిల్లాలో మంచి పేరుంది. అలాగే ఇది దేవుడి స్క్రిప్ట్ అని గతంలో జగన్ కు అండగా నిలిచినందుకు జూన్ 8న తనపై అనర్హత వేటు పడింది, ఇదే రోజున మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం అదృష్టం అంటూ కొడాలి, అదే జిల్లాకు చెందిన పేర్ని నాని హర్షం వ్యక్తం చేసారు. అలాగే తాను మాత్రం తాను జగన్ కు కారు డ్రైవర్ గా ఉండటానికి కూడా సిద్ధంగా ఉన్నానని తనకు క్యాబినెట్ పదవి ఇవ్వడం చాలా పెద్ద గౌరవం అన్నారు నాని.ఈయనకు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ ఇవ్వడం జరిగింది.