వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణపై 12,886 తేడాతో ఓడించి రికార్డు సృష్టించి తెలుగుదేశం కంచుకోటలో మొదటిసారి భారీ విజయాన్ని నమోదు చేసారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చివరి నిమిషంలో శ్రీరంగనాథరాజుకు కేబినెట్‌లో బెర్త్ ఖరారుచేశారు.
2004లో అత్తిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన ఈయన అప్పటి మంత్రి, రాజకీయ ఉద్దండుడు దండు శివరామరాజును ఓడించి సంచలనం సృష్టించారు. నేడు మళ్లీ ఆచంట నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి రాష్ట్ర మంత్రిగా సుదర్ఘీకాలం పాటు పనిచేసిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను ఓడించి మరోసారి రికార్డుసృష్టించారు. ఇలా జిల్లాలో ఉద్దండులైన ఇద్దరు మంత్రులను మట్టి కరిపించిన ఘనత శ్రీరంగనాథరాజుకే దక్కించుకుని మంత్రివర్గంలో చెరుకువాడ స్థానం పొందారు.ఈయనను గృహనిర్మాణం శాఖామంత్రిగా నియమించారు.